డా. మాధవరావు నెక్కంటిఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థోపెడిక్స్ English కాల్ చేయండి

ఆటల్లో గాయాలు — ఎప్పుడు డాక్టర్‌ని కలవాలి

క్రీడల గాయాలు5 నిమిషాల పఠనం

ఆడుతున్నప్పుడు తగిలే చాలా గాయాలు వాటంతట అవే తగ్గిపోతాయి. ఇబ్బందల్లా ఒకటే — తగ్గిపోయేవి, తగ్గనివి మొదట్లో ఒకేలానే కనిపిస్తాయి. వాపు ఎంత తొందరగా వచ్చింది, కీలు నిలకడగా ఉందా, కాలు మీద బరువు మోపగలుగుతున్నారా — ఈ మూడింటిని బట్టే చాలావరకు తేల్చుకోవచ్చు.

అదే రోజు చూపించుకోవాల్సినవి

  • ఎముక లేదా కీలు వంకరగా, స్థానం తప్పినట్టు కనిపిస్తే. ఆకారమే మారిపోయినట్టు అనిపిస్తే ఒక్క రాత్రి కూడా ఆగవద్దు.
  • కాలు మీద అస్సలు బరువు మోపలేకపోతే. మోకాలికి లేదా చీలమండకు దెబ్బ తగిలాక ఒక్క అడుగు కూడా వేయలేకపోతే అది తేలిక విషయం కాదు.
  • గంటలోపే వాపు వచ్చేస్తే. అంత తొందరగా వచ్చే వాపు అంటే కీలు లోపల రక్తం చేరిందనడానికి సూచన.
  • మొద్దుబారడం, జివ్వుమని సూదులు గుచ్చినట్టు అనిపించడం, లేదా కాలు, చెయ్యి పాలిపోయి చల్లగా అయిపోవడం.

రెండు మూడు రోజుల్లో చూపించుకోవాల్సినవి

  • దెబ్బ తగిలిన వెంటనే కాకుండా, రాత్రికి లేదా మరుసటి రోజుకి మెల్లగా వచ్చిన వాపు.
  • కీలు మధ్యలో ఏదో ఇరుక్కున్నట్టు అనిపించడం, మోకాలు పూర్తిగా చాపలేకపోవడం, లేదా నడుస్తుంటే మోకాలు ఒక్కసారిగా తప్పుకుపోయినట్టు అనిపించి తూలిపోవడం.
  • మూడు నాలుగు రోజులైనా నొప్పి ఏమాత్రం తగ్గకపోవడం.
  • భుజం జారి, దానంతట అదే మళ్లీ కుదురుకున్నా ఒకసారి చూపించుకోవడం మంచిది.

ముందు ఇంట్లోనే చూసుకోదగినవి

  • కొద్దిగా బెణికిన చీలమండ — నడవగలుగుతూ, వెంటనే వాపు రాకపోతే.
  • క్రికెట్ ఆడాక, కబడ్డీ తర్వాత, జిమ్‌లో బరువులు ఎత్తాక కండరాలు పట్టేసినట్టు అనిపించడం, నొప్పి — రోజు రోజుకీ తగ్గుతూ ఉంటే.
  • నల్లగా కమిలిన చోటు మాత్రమే ఉండి, చెయ్యి కాలు పని మామూలుగానే చేస్తుంటే.
  • కొన్ని రోజులు ఎక్కువ శ్రమ లేకుండా విశ్రాంతి, ఐస్ పెట్టడం, ఆ తర్వాత మెల్లగా మామూలు పనుల్లోకి రావడం — వీటికి ఇదే సరైన మొదటి అడుగు.

చాలామంది చేసే పొరపాటు

  • కీలు ఇంకా నిలకడగా అనిపించకముందే మళ్లీ ఆటలోకి దిగడం.
  • రెండోసారి తగిలే దెబ్బ సాధారణంగా మొదటిదాని కంటే ఎక్కువ ఇబ్బంది పెడుతుంది.
  • మోకాలి విషయంలో మెనిస్కస్‌కి (కీలు లోపలి మృదులాస్థి) నష్టం జరిగేది చాలాసార్లు రెండోసారి దెబ్బ తగిలినప్పుడే.

ఎప్పుడు వెంటనే చూపించాలి

కీలు వంకరగా కనిపించడం, కాలు మీద అస్సలు బరువు మోపలేకపోవడం, లేదా దెబ్బ తగిలిన వెంటనే వాపు రావడం — ఈ మూడింటిలో ఏది ఉన్నా అదే రోజు చూపించుకోవాలి. రేపు చూద్దాంలే అనుకోవద్దు.

వీటిలో ఏది మీ పరిస్థితి అని తెలియడం లేదా?

అందుకే కన్సల్టేషన్. హైదరాబాద్‌లో సోమవారం నుంచి శుక్రవారం, కాకినాడలో శనివారం.

040 6833 4455 హైదరాబాద్ · 096031 33777 కాకినాడ